ఐటి పార్క్ భూసేకరణలో రైతుకు అన్యాయం

మంచిర్యాల జిల్లా హాజిపూర్ మండలంలోని వేంపల్లి లో ఐటి పార్కు భూసేకరణలో తీవ్ర అన్యాయం జరిగిందని మాడుగుల నర్సయ్య అనే రైతు సోమవారం జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు.తమ వద్ద వాస్తవంగా (మోక ప్రకారం)ఐదు ఎకరాలకు పైగా భూమి ఉన్నప్పటికి అధికారుల నిర్లక్షంతో కేవలం ఒక ఎకరానికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. వేంపల్లి గ్రామ రెవెన్యూ శివారు సర్వే నెం:159/37లో తమ కుటుంబం సంవత్సరాలుగా నిరంతరంగా భూమిని సాగు చేస్తోందని,వాస్తవ స్వాధీనంలో ఉన్న మొత్తం విస్తీర్ణం 5ఎకరాలు ౦౨ గుంటలుగా ఉందని తెలిపారు. కాగా పాస్‌బుక్‌లో ఒక్క ఎకరం ౦౧ గుంట మాత్రమే నమోదై ఉండటాన్ని కారణంగా చూపి, మిగతా భూమికి నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు చేతులు దులుపుకున్నారని తెలిపారు. భూసేకరణకు సంబందించి నోటిఫికేషన్ తమకు వ్యక్తిగతంగా అందలేదని, గ్రామ స్దాయిలో కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు.
కేవలం పత్రిక ప్రకటనకే పరిమితం కావడంతో అభ్యంతరాలు తెలిపే అవకాశం కోల్పోయామని తెలిపారు. ప్రాధమిక విచారణ నివేదికలో కూడా వాస్తవ స్తితిని పక్కన పెట్టి యాంత్రికంగా ఒక ఎకరం మాత్రమే చూపడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే భూసేకరణలో తమ లాంటి పరిస్దితిలో ఉన్న ఇతర రైతులకు మోకా ఆధారంగా పూర్తి నష్టపరిహారం చెల్లించగా, తన విషయంలో మాత్రం వివక్ష చూపారని ఆరోపించారు. భూసేకరణకు కాన్సెంట్ అవార్డు పేరిట జరిగిందని చెప్తున్నా తన నుంచి స్వచ్చంద సమ్మతి తీసుకోలేదని ఒత్తిడితో సంతకాలు సేకరించారని ఆరోపించారు. మిగిలిన భూమికి కూడా నష్టపరిహారం చెల్లించాలని లేనిపక్షంలో స్పష్టమైన కారణాలతో రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు బాధిత రైతు నర్సయ్య తెలిపారు. ఈ విషయంపై జిల్లా స్దాయిలో స్వతంత్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Listings
News
Home
Jobs
Contact